విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
‘సూపర్ సిక్స్’ అమల్లో కూటమి సర్కారు విఫలం
ప్రజాస్వామ్య వారసులు ‘కమ్యూనిస్టులు’
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
శ్రీకాళహస్తి:
ప్రపంచాన్ని కుదిపేస్తున్న సోలార్ విద్యుత్ కుంభకోణంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెదవి విప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కుంభకోణంలో అదానీతో పాటు మోడీ, జగన్, చంద్రబాబులకు వాటా ఉందని ఉద్ఘాటించారు. డిసెంబర్ 1 నుంచి ప్రజలపై ట్రూ అప్ చార్జీల మోతకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడులో ఆదివారం తిరుపతి జిల్లా 14వ మహాసభలు ఉత్సాహంగా, ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి. మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి నగర్ లో నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి శ్రీనివాసరావు మాట్లాడారు. డబ్బు, కులం, కుటుంబ పాలనలాంటి అంశాలు ఈ రోజుల్లో అధికారాన్ని, నాయకులను తయారు చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తారతమ్యాలకతీతంగా నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్న పార్టీ సీపీఎం అన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటున్నారనీ భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఓ కీలక వ్యక్తికి సోలార్ విద్యుత్ కుంభకోణంలో
రూ.1700 కోట్లు ముట్టాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తున్నా మోడీ, చంద్రబాబులు ఎందుకు విచారణ జరపడంలేదని ప్రశ్నించారు. తాను మోడీ చెప్పినట్లు చేశానని జగన్, మోడీ చెప్పకుండా తానేమీ చేయలేనని చంద్రబాబులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అదానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఒక మెగా వాట్ సోలార్ విద్యుత్ ను తయారు చేయాలంటే అదానికి 400 ఎకరాల భూములు కావాలనీ, ఒక్కో ఎకరానికి రైతుకు రూ. 30 వేలు చెల్లించి ఆ భూముల ద్వారా అదానీ నెలకు రూ. 5 లక్షలు ఆదాయం కొట్టేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. మోడీ పాలనలో ఉద్యోగులు, కార్మికుల వేతనాలు 8 నుంచి 3 శాతానికి పడిపోగా నిత్యావసర ధరలు మాత్రం 8 నుంచి 16 పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్పొరేట్ల భజన మూలానా దేశానికి ఈ దుస్థితి పట్టిందని వాపోయారు. స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక చేవ సచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం మోపినా అడిగే దిక్కులేదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాటకు విలువలేదని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ తూలనాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంటూ తెగేసి చెప్పినా కూటమి సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా ఉండదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సోపా ఎక్కాయన్నారు. మెగా డీఎస్సిపై బాబు చేసిన తొలిసంతకం చెరిగిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ చూడరాదనీ, ప్రశ్నించాలనీ, కమ్యూనిస్టులతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. చెగువేరా, భగత్ సింగ్ వారసుడినంటూ ఎగసి పడ్డ డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి లడ్డూ వివాదాన్ని సాకుగా చూపి సరికొత్త సనాతనీ బాబాగా మారారనీ, ఆయన సమతా వాదా..! ఆర్ఎస్ఎస్ వాదో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలు చూస్తున్నారనీ, ఉమ్మడి పోరాటాల ద్వారా బలమైన రాజకీయ పార్టీగా సీపీఎం భవిష్యత్తులో అధికారాన్ని చేపట్టడం ఖాయమన్నారు. అందుకవసరమైన కర్తవ్య దీక్షను ప్రవేశ పెట్టారు. అంతకముందు సీపీఎం ప్రతినిధుల నడుమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీపీఎం రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ లు, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరయ్య కూడా మాట్లాడారు. తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, చిత్తూరు జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు, తిరుపతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, దాసరి జనార్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.