“స్వర్ణముఖి”నే కాదు, స్మశాన వాటికల్నీ తవ్వేస్తున్నారు!
ఇసుక మాఫియాను అరికట్టాలి : నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి రూరల్ స్వర్ణముఖి నదిలో యదేచ్చగా “ఇసుక మాఫియా” రాజ్యమేలుతున్నా చోద్యం చూస్తున్న రెవెన్యూ,పోలీస్ అధికార యంత్రాంగం!
రాజకీయ పార్టీ నాయకుల పదవుల కోసం వారి
“రాజకీయ ధన దాహానికి” బలి పశువులుగా మారి ఉద్యోగాలు కోల్పోయి మనోవేదనకు గురైన ఐఏఎస్,రెవెన్యూ,మున్సిపల్ అధికారుల దయనీయ దీనస్థితిని అన్నీ శాఖల ఉన్నతాధికారులు,ఉద్యోగస్తులు గమనించి రాజకీయ నాయకుల “ఉచ్చులో” పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు!
తిరుపతి జిల్లా నూతన కలెక్టర్,ఎస్పీ గారు సంయుక్తంగా స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలలో రాజకీయ నాయకుల సంపూర్ణ సహకారంతో యదేచ్చగా జరుగుతున్న
“ఇసుక మాఫియా” పై ఉక్కు పాదం మోపి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న వారిపై చట్టపరంగా కతిన చర్యలు తీసుకోవాలని నవీన్ విజ్ఞప్తి చేసారు!
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాలను,చెరువులను సంరక్షించుకోవాలని “నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్”(NGT),సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) సంయుక్తంగా ప్రభుత్వ,అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై “హైకోర్టు”కి నివేదిక ఇవ్వడం శుభ పరిణామం!
తిరుపతి రూరల్ గ్రామాలలోని చిగురువాడ,చానంబట్ల, పైడిపల్లి,అడపారెడ్డి పల్లి,దుర్గ సముద్రం,తనపల్లి, తిరుచానూరు,తండ్లం,గాజులమన్యం మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది రూపురేఖలు పూర్తిగా మారిపోయి సుమారు 30 అడుగుల లోతు “బావి” లుగా దర్శనమిస్తున్నా జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యతారాహిత్యం అన్నారు!
స్వర్ణముఖి పరిసర గ్రామాలలోని ప్రైవేటు పట్టా భూములలో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసిన ఇసుకను సైతం అమ్మాలన్నా “ఒక రోజుకి ఒక ట్రాక్టర్ 3500 రూ”” అధికార పార్టీ నాయకులకు చెల్లిస్తున్నామని,గ్రావెల్ కు ఒక రోజుకి “ఒక టిప్పర్ సుమారు 9 వేలు చెల్లిస్తున్నామని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు!
స్వర్ణముఖిలో ఇసుక పూర్తిగా కనుమరుగైందని హిటాచి,జెసిబి లాంటి భారీ వాహనాలతో ప్రకృతి సంపదలను కొంత మంది జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో కొల్లగొడుతున్నారని ప్రశ్నించిన “గ్రామస్తులపై అక్రమ కేసులు” బనాయించి వేధిస్తున్నారని ప్రతి గ్రామంలోని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు!
స్వర్ణముఖికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు వినియోగించే “స్మశానాలను” సైతం ఇసుక కోసం జెసిబి లతో త్రవ్వేస్తున్నారని “శవాలను ఖననం” చేసుకోవడం కష్టతరంగా మారిందని పరిసర ప్రాంత గ్రామస్తులు ప్రభుత్వ అధికారుల,అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆవేదనతో కుమిలిపోతున్నారన్నారు!
తిరుపతి జిల్లా రెవెన్యూ,పోలీస్ అధికార యంత్రాంగం సంయుక్తంగా దాడులు చేసి “ఇసుక మాఫియాను ఉక్కు పాదం”తో అణిచివేసి ప్రకృతి సంపదను,పర్యావరణాన్ని సంరక్షించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు!
(లోక్ పెన్ -తిరుపతి )
16 ఫిబ్రవరి 2024